కోస్తాలోని పద్నాలుగు మంది అధికారపార్టీ ఎమ్మెల్యేలు తమ వద్దఉన్న బ్లాక్‌మనీని ఎలా మార్చుకోవాలో అర్థంకాక తీవ్రంగా మదనపడిపోతున్నారు. బయటకు చెప్పలేరు.. లోపల ఉంచుకోలేరు.. ముప్పైశాతం డబ్బు ఇస్తే.. అంటే కోటి రూపాయలలో ముప్పైలక్షలు ఇస్తే మార్చిపెడతామని ఫోన్లు చేస్తున్న హవాలా వ్యాపారుల కోసం కొంతమంది ఎమ్మెల్యేలు వాకబు చేస్తున్నారు. మరికొంతమంది అనుచరుల ద్వారా బ్యాంకులలో పొలాలు ఉన్న రైతుల పేరుమీద డిపాజిట్లు వేయిస్తున్నారు. ఇలా ఎవరి బాధలు వారు పడుతున్నారు. కానీ ఈ 14 మంది ఎమ్మెల్యేల వద్ద నోట్లకట్టలు మూలుగుతున్నాయన్న సంగతి గూఢచారి వర్గాల ద్వారా చంద్రబాబు వరకూ వెళ్లింది. ఆదాయపు పన్నుశాఖ అధికారులు నిఘా వేస్తారని తెలియడంతో ఆ ఎమ్మెల్యేలు కిక్కురుమనడం లేదు. తొలుత తమ బ్లాక్‌మనీని బంగారు బిస్కెట్ల రూపంలోకి మార్చుదామని ప్రయత్నించినప్పటికీ ఐటీనిఘా ఉండటంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. "డబ్బు ఉండీ శని పట్టడం అంటే ఇదేనేమో'' అని వారి అవస్థలను చూసినవారు వ్యాఖ్యానిస్తున్నారు.